మిడిల్ బెర్త్
(ఒక గల్పిక)
రాత్రి తొమ్మిది గంటలు.
కొల్లం నుంచి తిరుగు ప్రయాణం.
రైలుబండి తన లయలో పరుగెడుతోంది.
ఆమె లోయర్ బెర్త్ మీద పడుకుంది.
కుర్తా, జీన్స్ పాంట్.
ప్రయాణ అలసటతో కళ్లు మూసుకుంది.
తన శరీరం గురించి ప్రపంచం ఏమనుకుంటుందో అది ఒక విషయం;
తనకు తనలో ఎవరున్నారో అది మరొక విషయం.
ఇంతలో కాళ్లదగ్గర ఏదో కదలిక.
ఆ తర్వాత మోకాలి కింది భాగంలో వేళ్ల ఒత్తిడి.
వెంటనే ఆమె గట్టిగా అంది—
“ఏయ్ మిస్టర్, బిహేవ్ యువర్ సెల్ఫ్!”
అతను క్షణంలో వెనక్కి జారుకున్నాడు.
“సారీ మేడం… నా కళ్ళజోడు పడిపోయింది. అది వెతుక్కుంటున్నాను.”
ఆ “మేడం” అన్న పిలుపులో నిజం ఎంత, అలవాటు ఎంత, వెకిలితనం ఎంత — ఆమె ఆ క్షణంలో ఆలోచించలేదు.
కాని తన అసౌకర్యం మాత్రం నిజమే.
ఆమె అసహనంగా చూసింది.
“అయినా మీ బెర్త్ ఎక్కడ?”
అతను పళ్ళికిలించి నవ్వాడు.
“నాది మిడిల్ లో ఉందండి. నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. రాగానే తినేసి… నేను ఎక్కుతాను.”
అతని మాటలోని ద్వంద్వార్థం ఆమెకు తగిలింది.
ప్రయాణం. రాత్రి. అపరిచితులు.
గొడవ పెంచుకోవడం ఇష్టం లేక ఆమె మౌనంగా ఉంది.
అరగంట గడిచింది.
రైలుబండి ఊగుతోంది.
రాత్రి మరింత దిగుతోంది.
ఇంతలో మళ్లీ—
ఆమె పిరుదులపై
లయబద్ధంగా
మూడు సార్లు
ఒక వెకిలి తట్టు.
“మేడం… మీరు లేస్తే నేను బెర్తెక్కుతాను…”
అతను నవ్వాడు.
ఆ నవ్వులో మర్యాద లేదు.
సంకోచం లేదు.
కేవలం అవకాశం దొరికిందన్న మృగానందం మాత్రమే ఉంది.
ఆమె చికాకుగా లేచింది.
అతను మిడిల్ బెర్త్ మీద ఎక్కి సర్దుకునే వరకూ నిలబడి చూసింది.
తర్వాత మళ్లీ తన బెర్త్ మీద పడుకుంది.
కానీ నిద్ర మాత్రం పడలేదు.
ఆ రాత్రి ఆమెకు మరోసారి ఒక సత్యం స్పష్టమైంది—
స్త్రీగా కనిపించడం చాలామందికి సరిపోతుంది;
ఆ స్త్రీ ఎవరు, ఎలా, ఏ అంతరంగంతో అక్కడ ఉందో తెలుసుకోవాలనే సంస్కారం మాత్రం అందరికీ ఉండదు.
తెల్లవారుజామున ఆమె స్టేషన్ వచ్చింది.
దిగి నడుస్తూ వెళ్లిపోయింది.
రైలుబండి నుంచి దిగింది ఆమె శరీరమే.
కాని ఆ రాత్రి నుంచి
అనుమతి లేని మగస్పర్శపై
మరింత అప్రమత్తంగా మిగిలింది
తనలో చాలా కాలంగా మెల్లగా మేల్కొంటున్న
ఆమె.
అతను ఆమె బెర్త్ హద్దు దాటాడు.
ఆమె మాత్రం
తనలోని స్త్రీ సత్యం
ఎంత సున్నితమో మరోసారి తెలుసుకుంది.