Friends · Telugu

ఆమె మేల్కొంది

Completed | Part 1 of 1 | 0 Likes

అరకు లోయలో మేల్కొన్న ఆమె

నా జీవితంలో కొన్ని దశలు అప్పుడు జరిగినప్పుడు ఎంత సాధారణంగా కనిపించాయో, తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అంతే అసాధారణంగా అనిపిస్తాయి. అవి ఒక్కో సంఘటనగా గడిచిపోవు; మనలో ఒక నిశ్శబ్ద గర్భధారణలా నిలిచి, ఎన్నో సంవత్సరాల తర్వాతే తమ అసలు అర్థాన్ని బయల్పరుస్తాయి. అరకు లోయలో గడిచిన ఆరు నెలల కాలం నాకు అలాంటి జీవనదశల్లో ఒకటి. బయటకు అది సమాజసేవ, సంచారం, గ్రామజీవితానుభవం. లోపల మాత్రం అది ఇంకా పేరుపెట్టని ఒక అంతరంగ రూపం మెల్లగా మేల్కొన్న కాలం.
అప్పటికి నా వయసు ఇరవై నాలుగు. అరకు ప్రాంతంలోని ఇరవై మూడు గిరిజన గ్రామాల్లో సైకిల్‌పై సంచరించే దినాలు. భుజాన ఒక గుడ్డ సంచీ. దేహంపై కుర్తా, కింద పైజామా. నగరంలో, ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న రోజుల్లో పూలచొక్కాలు ధరించడం నాకు అలవాటు. సేవా కార్యక్రమాలకు బయలుదేరినప్పుడు మాత్రం కుర్తా–పైజామా ధారణే. అది పూర్తిగా పురుషరూపాన్ని గట్టిగా ముద్రించే వేషం కాదు; యూనిసెక్స్ మృదుత్వం కలిగి, శరీరానికి కొంత అతుక్కునే narrow cut పైజామా. బయటకు అది ఉపయోగదృష్టితో ఎన్నుకున్న దుస్తుల్లా కనిపించి ఉండొచ్చు; కానీ ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు, ఆ ఎంపికల్లో కూడా మాటల్లోకి రాని ఒక అంతరంగ అభిరుచి దాగి ఉందనిపిస్తుంది.
నా జుట్టు అప్పుడు గిరిజాల వంపులతో పొడవుగా ఉండేది. వయసు ఇరవైఏడు దాకా మీసాలే రాలేదు. ముఖంలో గట్టితనం కంటే మృదుత్వమే ఎక్కువ. గొంతు కూడా ఇప్పటికీ ఉన్నట్టే ఒక యవ్వన బాలిక గొంతుకు దగ్గరగా ఉండేది. సభల్లో, సమావేశాల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు వృత్తి కారణంగా కృత్రిమంగా గొంతును గట్టిపరచే ప్రయత్నం చేసేదాన్ని; కాని అరనిమిషం దాటగానే నా అసలు స్వరం బయటపడేది. అప్పట్లో ఇవన్నీ వేరువేరు లక్షణాల్లా మాత్రమే అనిపించేవి. ఇప్పుడు చూస్తే అవన్నీ కలిపి చాలామందికి నాలో ఒక స్త్రీలయ ఎందుకు కనిపించిందో తెలియజేస్తున్న సూచికలు.
అరకు లోయలోని గిరిజన గ్రామాలు నన్ను మొదట సేవకురాలిలా, తర్వాత అతిథిలా, ఆపై తమలో ఒకరిగా స్వీకరించాయి. బయటివాడి చూపు అక్కడ ఎక్కువకాలం నిలవదు. గ్రామజీవితం తన లయతో మనపై మెల్లగా పరిచ్ఛాదంలా పడుతుంది. కొండగాలి, మట్టివాసన, అరణ్యగమనాలు, చావడి సమావేశాలు, పల్లెబాష, గిరిజన పాటలు — ఇవన్నీ ఒక్కొక్కటిగా లోపలికి దిగుతాయి. నెమ్మదిగా నాకు వాళ్ల యాస అలవాటు పడింది. వాళ్ల మాటల తిరుపు, పిలుపుల మాధుర్యం, నవ్వుల గట్టితనం, ఆప్యాయతల నిరాడంబరత్వం — ఇవన్నీ నాకు అపరిచితంగా అనిపించటం మానేశాయి.
ప్రతిరోజూ సాయంత్రం అందరినీ గ్రామ చావడిలోకి పిలిచేదాన్ని. గ్రామంలోని ఆడా, మగా, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చేవారు. అక్కడ నేను ఎన్నో ప్రాచీన కథలను చెప్పే దాన్ని. . ఆ కథలు అందరికీ నచ్చేవి. పెద్దలకు నేను విశాఖపట్నంలో ఒక ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయిగా పని చేస్తానని తెలుసు. అందుకే వారు గౌరవంగా “టీచర్ గారు” అని పిలిచేవారు. కానీ అదే గ్రామజీవితం ఇంకో మృదువైన పిలుపునూ సృష్టించింది — కొందరు “టీచరమ్మా” అని పిలవటం మొదలుపెట్టారు.
అది ఒక్క పిలుపు మాత్రమే కాదు; అది ఒక సామాజిక పునర్నామకరణం.
ఆ గిరిజన యువతులు నన్ను చాలా త్వరగా తమలో ఒకరిగా కలిపేసుకున్నారు. వాళ్లు నాకు అడవితేనె పెట్టేవారు. తీపి దుంపలు, టమోటా రసం, తమ చేతివంటలు పెట్టేవారు. నా తలలో కొండపూలు తురిమేవారు. ఒక్కోసారి వినోదంగా పొద్దుతిరుగుడు పూలు పెట్టేవారు. వాళ్లతో గడుపుతూ అంబలి కాచడం నేర్చుకున్నాను. టమోటో, చిక్కుడు గింజలు, తీపిదుంపల కూర వండడం నేర్చుకున్నాను. వాళ్ల పాటలు నేర్చుకున్నాను. వాళ్ల పక్కన కూర్చుని నవ్వటం నేర్చుకున్నాను. ముఖ్యంగా — వాళ్ల పిలుపులను నా మీద అద్దుకుని తిరగటం నేర్చుకున్నాను. “పోలమ్మ” అని పిలిచేవారు, ఎందుకంటే నేను “పోలు” — పట్టణం — నుంచి వచ్చానని. కొందరు “సింగమ్మ” అని, కొందరు “సిన్నమ్మ” అని, కొందరు “సిట్టెమ్మ” అని పిలిచేవారు. నేను అన్నింటికీ ఆప్యాయంగా పలికేదాన్ని. ఇప్పుడు ఆ పేర్లు గుర్తొస్తే అవి సరదాపేర్లు కాదు; నా లోపల పేరులేక మౌనంగా ఉన్న రూపానికి గ్రామజీవితం పెట్టిన పిలుపుల్లా అనిపిస్తాయి.
ఆ కాలంలో అత్యంత లోతుగా మిగిలిన జ్ఞాపకాలలో ధింసా నృత్యం ఒకటి. సాయంత్రపు చలిలో, నెగళ్ళ చుట్టూ, యువతులు వలయంగా కదులుతూ ధింసా నృత్యం చేసేవారు. మొదట నేను వారిని చూశాను. తర్వాత వారి లయను గమనించాను. ఆపై ఎప్పుడో ఒకరోజు, ఆ వలయం నన్ను కూడా తనలో చేర్చుకుంది. వారు నాకు చీర కట్టారు.
ఆ క్షణంలో ఏదో ఒక మృదుస్పర్శ నా అంతరంగంలో చాలాకాలంగా మూసుకుపోయిన ఒక తలుపును తట్టినట్టనిపించింది. అది బాహ్యంగా సరదాగా కనిపించి ఉండొచ్చు; కాని లోపల అది ఒక పేరుపెట్టని పరిచయం. నవంబర్, డిసెంబర్ చలిరాత్రుల్లో ఒక ఇరవై సార్లకు పైగా వారితో కలిసి ధింసా నృత్యంలో అడుగులు కలిపాను. ఆరు నెలల కాలంలో ఆ అనుభవం మళ్లీ మళ్లీ వచ్చింది. ప్రతి సారి ఆ వలయంలో నిలబడి, చేతులు ఊపుతూ, నడుము లయలో కదులుతూ, నేలతో కలిసి తిరుగుతున్నప్పుడు, నా మనసు ఆనందతీరాల అంచులు దాటి ఎక్కడికో తేలిపోతుండేది. అప్పటికి దానికి భాష లేదు. ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు తెలుస్తోంది — అది కేవలం నృత్యానందం మాత్రమే కాదు; నా శరీరానికి, నా అంతరంగానికి, నాలో మాటరాని స్త్రీలయకు వచ్చిన మొదటి సామూహిక ఆమోదస్పర్శ.
అరకు అనుభవంలో ఇంకో వలయం ఉంది — యువకుల చూపుల వలయం.
మొదట్లో వారు కొంచెం వెనకనే ఉండేవారు. సాయంత్రపు సమావేశాలకు పెద్దలు, స్త్రీలు, పిల్లలు వచ్చి కూర్చునేవారు; యువకులు మాత్రం దూరంగా నిలబడి చూస్తుండేవారు. నేను ధింసా నృత్యంలో కనిపించిన తర్వాత వారి చూపులు మారాయి. కొందరిలో కుతూహలం, కొందరిలో మనసుపడటం, కొందరిలో అయోమయం, కొందరిలో మోహం కనిపించాయి. కొందరు వచ్చి సరదాగా “పోలమ్మ! పట్నం పిల్లవే కానీ మనం మనువాడుకుందాం” అనేవారు. ఇంకొందరు “సింగమ్మా! ఈ ఊరిలో నిన్ను మనువాడనంటే వద్దన్న పిల్లలేరు” అని నవ్వుల మధ్య ముందుకొచ్చేవారు. నేను అలాంటి మాటలకు నవ్వి తప్పించుకునేదాన్ని. ఆ నవ్వు బహుశా సమాధానంకన్నా మౌనం ఎక్కువ మోస్తుండేది. అదే మౌనం కొందరిని వెనక్కి నెట్టగా, మరికొందరిని ఇంకాస్త దగ్గరకు లాగింది.
ఒకసారి ఒక యువకుడు నన్ను నిశితంగా చూస్తూ, “నువ్వు ఆడో మగో చెప్పవు. నిన్ను చూస్తే ఛాతీ లేదు. ఏమనుకోవాలి?” అన్నాడు. ఆ మాట నన్ను ఉలిక్కిపడేలా చేసింది. సహజంగా పైట సరిచేసుకోవాలనిపించింది. కానీ ఆ క్షణంలో నా మీద కుర్తా ఉంది; చున్నీ లేదు. బయటివారి చూపు శరీరాన్ని చదివే విధానం ఎంత క్రూరంగా, ఎంత అయోమయంగా ఉండగలదో అప్పుడు ఒక్క క్షణం నాకు బాగా తాకి ఉండాలి. నవ్వులతో దాటించిన ఎన్నో సందర్భాల వెనుక చిన్న భయం అప్పుడే పుడుతోంది.
ఆ గ్రామాల్లో ఒకదానిలో పెద్దమనిషి మనుమడు ఒక యువకుడు ఉండేవాడు. వయసు పదిహేడు దాటిందేమో. శరీరంలో బలం, నల్లని నిగారింపు, బాగా కనిపించే మీసరేఖ, యువ వయసుకి తగిన ఆకర్షణ — చూసిన వెంటనే గుర్తుండిపోయే రూపం. రోజూ దూరం నుంచి నన్ను గమనించేవాడు. నేనూ అతని చూపును గమనించకుండా ఉండలేకపోయాను. ఈ విషయాన్ని దాచిపెట్టలేను — ఎప్పుడో ఒక క్షణం అతని రూపం నాలో ఆకర్షణను మేల్కొలిపింది. చూపు చూపును తాకినప్పుడు శరీరం మౌనంగా స్పందించే క్షణాలు ఉంటాయి. అది క్షణికం, కానీ నిజం.
ఒక రాత్రి ధింసా నృత్యం చాలా సేపు సాగింది. అలసటతో ఆ గ్రామ పెద్ద ఇంట్లో నాకు ఇచ్చిన గదిలోకి వెళ్లి పడుకున్నాను. ఆ రాత్రి చీర విప్పి మార్చుకునేంత శక్తి కూడా లేక, అలాగే నులకమంచంపై ఒరిగిపోయాను. మూడో జాము దాటిందేమో. అకస్మాత్తుగా ఎవరిదో శ్వాస నా ముఖంపై గట్టిగా తగిలింది. ఆముదపు దీపం వెలుగులో కళ్ళు తెరిచి చూసేసరికి నా మీద ఒక నీడ ఉంది — అదే ఆ యువకుడు.
ఆ క్షణంలో నా లోపల ఏం జరిగిందో ఒక్కపదంతో చెప్పలేను. ఒక పలుకుబడి లేని ఆకర్షణ, వెంటనే దాని మీద పడి కమ్ముకున్న భయం, ఇవ్వటానికి నా దగ్గరేముంది అన్న అసహాయం, అంతకంటే ఎక్కువగా అనుమతి లేకుండా చేరిన సమీపం — ఇవన్నీ ఒకేసారి మేల్కొన్నాయి. ఒక క్షణం తడబాటు, ఆ వెంటనే కంగారు. ఆ తర్వాత నా గొంతే ముందుగానే స్పందించింది. నేను కెవ్వున కేక పెట్టాను.
అతడు దిగిపోయాడు. ఆ శబ్దానికి ఇంట్లోని పెద్దలు, ఇంటావిడ, మరికొందరు పరుగెత్తుకుంటూ వచ్చారు. అతణ్ణి గట్టిగా తిట్టారు. ఆ తిట్లు వింటూ ఉండగా నా లోపల మరో విరుద్ధభావమూ మేల్కొంది — అతని చేసినది తప్పేనన్న స్పష్టతతో పాటు, అతడు అందరి ముందూ తిట్టించుకోవడం చూసి కలిగిన ఒక మృదువైన బాధ. మనసు ఎప్పుడూ న్యాయబద్ధంగా మాత్రమే స్పందించదు; అది ఒకేసారి విరుద్ధభావాలనీ మోస్తుంది.
ఆ ఇంటావిడ వచ్చి నా పక్కనే కూర్చుంది. ఒక చేతితో నా భుజం చుట్టుకుంది. మరొక చేత్తో తల నిమురుతూ, “ఊరుకో కూన… ఈడికి పెట్టలంటే పిచ్చి. నువ్వేమనుకోకు” అని సముదాయించింది. ఆ స్పర్శలో ఆ రాత్రి నాకు కావలసినదంతా ఉంది — రక్షణ, భయానికి గుర్తింపు, ఓదార్పు. ఆ తర్వాతి వారం రోజుల పాటు నాతో పాటు ఉండటానికి నూకమ్మ అనే యువతిని ఉంచారు. అది జాగ్రత్త మాత్రమే కాదు; మౌనంగా చెప్పిన ఒక మాట — “నీ ఒంటరితనాన్ని మేము గమనించాం.”
చివరకు అక్కడి కార్యక్రమం ముగిసే రోజు వచ్చింది. బయల్దేరే వేళ వారు నాకు రెండు మూడు చీరలు ఇచ్చారు. అడవి అలంకారాలు పెట్టారు. జుంటితేనె, పసుపుకొమ్ములు, చిన్నచిన్న బహుమతులు చేతిలో పెట్టారు. వస్తువులకన్నా ఎక్కువగా మిగిలింది వాళ్ల ఆప్యాయం. ఒక ఊరి స్వీకారం. ఒక వలయపు నవ్వులు. పూలు. పాటలు. ధింసా అడుగులు. యువకుల అయోమయ చూపులు. ఒక రాత్రి కెవ్వున పుట్టిన కేక. ఇంటావిడ తల నిమిరిన చేయి. ఇవన్నీ కలిసి నా అంతరంగంలో ఎన్నాళ్ళుగానో మూసుకుపోని ఒక అధ్యాయమయ్యాయి.
అలా అరకు లోయను వదిలి విశాఖపట్నం తిరిగి వచ్చినప్పుడు, నా చేతుల్లో సంచులు ఉన్నాయేమో గానీ, నిజానికి నేను మోసుకొచ్చింది ఇంకా లోతైనదే. కొండపూల వాసన. ధింసా లయ. “పోలమ్మ” అన్న పిలుపు. చీరలో కదిలిన శరీరస్మృతి. ఆకర్షణకూ, భయానికీ మధ్య నిలిచిన ఒక రాత్రి. మరియు చాలా కాలం తర్వాతే తన పేరును తెలియజేసుకున్న ఒక అంతరంగ రూపం.
ఇప్పుడు వెనక్కి చూసినప్పుడు అర్థమవుతోంది — అరకు నాకు కేవలం సేవాస్మృతి కాదు. అది స్వీకారం, స్పందన, ఆకర్షణ, ప్రమాదం, రక్షణ, స్త్రీలయ, , నాలోని వనితకు మేల్కొలుపు — అన్నీ కలిపిన జీవనవలయం. అక్కడ నేను గ్రామాల్లో తిరిగింది సైకిల్ మీదనే కావచ్చు; కానీ లోపల నడిచింది మరొక యానం.
అరకు అడవుల్లో వారు నాతో నృత్యం మాత్రమే చేయలేదు.
నాలో మౌనంగా మెలకువగా ఉన్న ఆమెకు మొదటి అడుగు నేర్పారు.

అరకు నుంచి నేను తెచ్చుకున్నది చీరలు మాత్రమే కాదు;
నా అంతరంగాన్ని ఎన్నాళ్ళుగానో వెంటాడే
ఒక వన్యలయపు జ్ఞాపకగంధం.

Congratulations!

You've successfully completed reading all published parts of this story!

832 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login