“నువ్వు అలసిపోయావా?”
కోమలి సమాధానం చెప్పలేదు. ఎందుకంటే అలసటను తన హక్కుగా ఎప్పుడూ భావించలేదు.
ఆ రోజు నుంచి స్వప్న నెమ్మదిగా కోమలి దగ్గరకు వచ్చింది. తల్లి ముందు చెప్పలేని ప్రశ్నలను రాత్రిళ్లు అడిగేది.
“అక్కా, నీకు చదవాలని ఉందా?”
కోమలి చేతులు ఆగిపోయాయి. “చదువు నాకెందుకు?”
“అది నీ మాట కాదు. అమ్మ మాట.”
ఆ మాట కోమలి గుండెను తాకింది. ఎన్నాళ్లుగానో తనలో మూసుకుపోయిన ఒక చిన్న గది తెరుచుకుంది.
సరోజ కోమలి చదువును పదో తరగతి దగ్గర ఆపేసింది.
“ఇక చాలు. ఇంట్లో పని చూసుకో. స్వప్న, చంద్ర చదువుకోవాలి,” అంది.
రామచంద్రరావు అభ్యంతరం చెప్పలేదు. “సరోజ చూసుకుంటుంది” అన్న అతని అలవాటు మళ్లీ అతన్ని మూగచేసింది.
ఇదే సమయంలో సరోజ వైద్యుల సహాయంతో కోమలిపై చికిత్సలు కూడా ప్రారంభించింది. కోమలి అర్థం చేసుకునే స్థితిలో లేకుండా, పూర్తి స్వతంత్ర నిర్ణయం ఇవ్వకుండా, “నీకు ఇది మంచిది” అనే పేరుతో శరీరాన్ని మార్పుల దారిలోకి నెట్టింది. వైద్య వివరాలు ఇంట్లో గోప్యంగా ఉండిపోయాయి. కానీ కోమలికి మాత్రం తన శరీరం కూడా తనది కాదనే భావం పెరిగింది.
ఆమె అద్దం ముందు నిలబడితే తనను తానే అడిగేది—
“నేను ఎవరు?
నేను ఇలా కావాలనుకున్నానా?
లేక నన్ను ఇలా చేశారా?”
సమాధానం రాలేదు.
నాలుగు సంవత్సరాలు గడిచాయి. స్వప్న ఇంటర్మీడియట్‌కి వచ్చింది. చంద్ర కూడా అదే వయసు. ఒక రోజు స్వప్న తన తండ్రి గదిలోకి వెళ్లింది.
“నాన్నా, కోమలి అక్కను కూడా కాలేజీలో చేర్పించాలి.”
రామచంద్రరావు ఆశ్చర్యపోయాడు. “ఇప్పుడా ? ఆమె చదువు మానేసి చాలాకాలమైంది.”
“అదే తప్పు. దాన్ని సరిచేయాలి.”
“మీ అమ్మ…”
“అమ్మతో నేను మాట్లాడుతాను. కానీ నాన్నగా మీరు ముందుగా అంగీకరించాలి.”
స్వప్న గొంతులో తల్లి కఠినత లేదు. కానీ తండ్రిని ఒప్పించే ధైర్యం ఉంది. రామచంద్రరావు మొదటిసారి తన పెద్ద బిడ్డ జీవితాన్ని నిజంగా ఆలోచించాడు. ఎప్పుడూ ఇంటి మూలలో తిరుగుతూ, అందరి పనులు చూసుకుంటూ, తనతో కళ్లలోకి చూసి మాట్లాడని కోమలి గుర్తుకు వచ్చింది.
ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు.
మరుసటి రోజు కోమలిని పిలిచాడు.
“నీకు చదవాలని ఉందా?”
ఆ ప్రశ్న విన్న కోమలి ముఖంలో భయం వచ్చింది. అనుమతి అడగడం తనకు అలవాటు. తన కోరిక చెప్పడం కాదు.
“నాకు… తెలియదు.”
స్వప్న మధ్యలో అంది—“తెలియదు కాదు అక్కా. భయమేస్తోంది అని చెప్పు.”
కోమలి కళ్లలో నీళ్లు తిరిగాయి.
చివరికి కోమలి కాలేజీలో చేరింది. మొదట ఆమెకు ఎంతో అసౌకర్యం. వయస్సు ఎక్కువ. చదువు విరామం. తన రూపం గురించి భయం. ఇతరుల చూపులు. కానీ స్వప్న ఆమెకు పుస్తకాలు తెచ్చింది. చంద్ర ఏమీ మాట్లాడకపోయినా, రాత్రిళ్లు నోట్స్ ఫోటోకాపీలు తీసుకొచ్చి ఆమె బల్లపై పెట్టేవాడు.
ఒక రోజు కోమలి నెమ్మదిగా అన్నది—“ధన్యవాదాలు చంద్రా.”
చంద్ర తలవంచి వెళ్లిపోయాడు. కానీ ఆ రాత్రి అతని గదిలో చాలా సేపు లైట్ ఆరలేదు. బహుశా తన మౌనం ఎంతకాలం కోమలికి భారమైందో అతను మొదటిసారి ఆలోచించాడు.
సంవత్సరాలు గడిచాయి. కోమలి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. పెద్ద విజయమేమీ కాదు అనుకునేవారికి అది కేవలం డిగ్రీ. కానీ కోమలికి అది తన చేతిలోకి తిరిగి వచ్చిన మొదటి హక్కు.
ఆమె ఇంట్లో ఇంకా పనులు చేసేది. సరోజకు సహాయం చేసేది. కానీ ఇప్పుడు ఆమె చేతుల్లో బలహీనత మాత్రమే లేదు. చదువుతో వచ్చిన చిన్న ఆత్మగౌరవం ఉంది.
స్వప్న, చంద్ర తమ గ్రాడ్యుయేషన్ తర్వాత పై చదువులకు జర్మనీకి వెళ్లారు. వెళ్లే రోజు స్వప్న కోమలిని గట్టిగా కౌగిలించుకుంది.
“అక్కా, నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండవద్దు. ఏదైనా అయితే నాకు వెంటనే చెప్పు.”
కోమలి నవ్వింది. “నేను పెద్దదాన్నికదా.”
స్వప్న కళ్లలో తడి. “నీకు పెద్దదానిగా ఉండే అవకాశం ఎవ్వరూ ఇవ్వలేదు. ఇకనుంచి నీకోసం కూడా బతుకు.”
చంద్ర దగ్గరకు వచ్చి కొద్దిసేపు నిలబడ్డాడు. తర్వాత మెల్లగా అన్నాడు—
“అక్కా… నేను చిన్నప్పుడు చాలా మౌనంగా ఉన్నాను. క్షమించు.”
కోమలి అతని ముఖాన్ని చూసింది. అది ఆమెకు ఊహించని మాట.
“నువ్వు చిన్నవాడివి చంద్రా.”
“కానీ ఇప్పుడు పెద్దవాడిని. ఇక మౌనంగా ఉండను.”
ఆ మాట కోమలికి పెద్ద బహుమతి. (ఇంకా ఉంది)
Discussion (0)