అంబిక గట్టిగా ఊపిరి పీల్చుకుంది. “రేవతి… నీవు చాలా భరించావు.” రేవతి భుజాలు ఎత్తి నవ్వింది. “భరించాను కాబట్టే కదా ఇప్పుడు ఇలా నవ్వగలుగుతున్నాను.” కొద్దిసేపు అందరూ మౌనంగా ఉన్నారు. తర్వాత అంబిక మళ్లీ అడిగింది. “మరి ఈ ఉద్యోగం?” “ఈ ఉద్యోగం దేవుడి విచిత్రమైన జోక్,” అంది రేవతి. “ఒకసారి మన బాస్ గారి భార్యకు. రోడ్డు ప్రమాదం జరిగింది. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. అవసరమైతే నా బ్లడ్ కూడా ఇచ్చాను. ఆమె ప్రాణం దక్కింది. తర్వాత ఆమె నన్ను గుర్తుంచుకుంది. ఇంటికెళ్లాక తన భర్తతో చెప్పి నాకు ఈ ఉద్యోగం ఇప్పించింది.” “మన బాస్‌నే?” అంది శైలజ ఆశ్చర్యంగా. “అవును,” అంది రేవతి. “ముందు మొహం చిట్లించాడు. కానీ ఆవిడ మాటకు కాదనలేక తీసుకున్నాడు. ఇప్పుడు మీరంతా నన్ను పొగిడినట్టే ప్రతిరోజూ ‘హాయ్ బేబీ, హౌ ఆర్ యూ?’ అంటూ పలకరిస్తాడు.” లత నవ్వేసింది. “అది అసలు అతని స్వభావం కాదు.” “నాకు తెలుసు,” అంది రేవతి. “అది అతని మర్యాద కాదు. అతని భార్య ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్.” అంబిక కూడా చిరునవ్వు నవ్వింది. “అయితే బాగానే ఉంది కదా.” రేవతి ఈసారి కళ్లలో కొంచెం వ్యంగ్యం మెరిపించింది. “ఎంత బాగుంది అనేది కాలమే చెప్తుంది. ఎందుకంటే… మన మగపుంగవులు ఉన్నారుగా—వీళ్ళు కూడా త్వరలో నా లాగే నవ్వడం నేర్చుకుంటారు. మన బాస్ కూడా నా పాత బాస్ లాంటి వాడే. పరిస్థితులు పండితే రూపాలు మారడానికి పెద్ద సిద్ధాంతాలు అవసరం ఉండవు. చాలు—ఒక మనిషిని ప్రతిరోజూ కొంచెం కొంచెంగా తక్కువ చేసి, అతనికి తన పాత రూపంలో నిలబడే శక్తి లేకుండా చెయ్యాలి. అనేదే బాసిజమ్” ఆ మాటతో ఆ టేబుల్ మీద మళ్లీ నిశ్శబ్దం నిలిచింది. అంబిక మెల్లగా రేవతి ముఖం చూసింది. ఆమెకు ఒక్కసారిగా ఈ ఉదయం రేవతిని చూసి నవ్విన ఆఫీసు పురుషులంతా గుర్తొచ్చారు. వాళ్లలో కొందరు చాలా దృఢంగా కనిపిస్తారు. గొంతు పెద్దగా ఉంటుంది. నడకలో మగతనం పొంగిపోతుంది. కానీ లోపల ఏదో ఒక రోజు ఎవరి ఒత్తిడికో, ఎవరి అవమానానికో, ఎవరి దుర్వినియోగానికో విరిగిపోవలసి వస్తుందేమో అనే ఆలోచన ఒక్కసారిగా మెదిలింది. ఆ ఊహతో అంబిక కళ్లలో విచిత్రమైన నవ్వు మెరిసింది. “సారీ రేవతి,” అంది. “ఎందుకు?” అని రేవతి కనుబొమ్మలెత్తింది. “నిన్ను చూసి కాదు… వాళ్ల ఫ్యూచర్ ఊహించుకుని నవ్వేసా.” రేవతి బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వులో ఇప్పుడు ఒంటరితనం లేదు. పక్కనే అంబిక కూడా నవ్వింది. లత, శైలజ కూడా చేరారు. ఆ రోజు తర్వాత అంబిక రేవతిని వేరే కళ్లతో చూడటం మొదలుపెట్టింది. “ఆమె ట్రాన్స్‌జెండర్” అన్న ఒకే వాక్యంతో కాదు. “ఆమె అవమానాన్ని వ్యంగ్యంగా మార్చుకున్న మనిషి” అన్న గౌరవంతో. క్రమంగా ఆఫీసులో కొన్ని మార్పులు కూడా వచ్చాయి. అంబిక, లత, శైలజలతో పాటు ఇంకొందరు మహిళలు రేవతితో మరింత బహిరంగంగా మెలిగారు. కొంతమంది పురుషులు ఇంకా నవ్వారు. కానీ ఆ నవ్వు ముందు లాగే ధైర్యంగా రాలేదు. ఎందుకంటే రేవతి వాళ్లను చూస్తే నవ్వేది. ఆ నవ్వులో వాళ్లకే అర్థంకాని ఒక జవాబు ఉండేది. ఒకసారి ఫైల్ తీసుకుని వచ్చిన ఒక యువకుడు, రేవతి సంతకం తీసుకుంటూ చేతిని కొద్దిగా వణికించాడు. “ఏమైంది?” అంది రేవతి. “ఏమీ లేదు,” అన్నాడు. రేవతి చిరునవ్వు నవ్వింది. “రిలాక్స్. నేను నిన్ను జాతరకి వెంటనే పంపించను.” అతనికి అర్థం కాలేదు. కానీ అంబికకు బాగా అర్థమైంది. ఆమే పక్కనే తలదించుకుని నవ్వుకుంది. కొన్ని కథలు పెద్ద దుఃఖంతో ముగిసిపోవు. కొన్ని కథలు పెద్ద విజయంతో ముగిసిపోవు. కానీ కొన్ని కథలు కేవలం ఒక మనిషి తన గాయాన్ని ఆయుధంగా కాకుండా నవ్వుగా మార్చుకున్న దగ్గర ముగుస్తాయి. రేవతి కథ అలాంటిది. ఆమెను కొందరు చూసి నవ్వుతారు. కానీ ఆమె నవ్వు వాళ్ల నవ్వుకన్నా లోతైనది. ఎందుకంటే వాళ్ల నవ్వులో హేళన ఉంది. ఆమె నవ్వులో అనుభవం ఉంది. సమాజానికి ఈ కథ చెప్పేది ఒక్కటే— ఎవరైనా రూపాంతరం చెంది మీ ముందుకు వచ్చారంటే, ముందుగా వాళ్ల దుస్తులను కాదు, వాళ్ల కథను అడగండి. ప్రతి మార్పు వెనుక ఒక కోరిక ఉండాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఒక దీర్ఘ హేళన, ఒక అవమాన జీవితం, ఒక ఒత్తిడి ప్రపంచం, ఒక మనిషిని తన పాత రూపం నుంచి దూరం చేస్తాయి. కొన్నిసార్లు అతను లేదా ఆమె ఆ దూరంలోనే కొత్త స్వరూపాన్ని కనుగొంటారు. రేవతి చివరికి తన గతాన్ని తిట్టుకోలేదు. తన పాత బాస్‌ను వెతికి శపించలేదు. తనను చూసి నవ్విన ప్రతి పురుషుణ్ణి శత్రువుగా చూడలేదు. ఆమె కేవలం నవ్వింది. ఎందుకంటే ఆమెకు తెలుసు— కొన్ని అవమానాలు ఏడిస్తే తగ్గిపోవు. కొన్ని అవమానాలు ఎదురుచూస్తే మళ్లీ వస్తాయి. కొన్ని అవమానాలను జయించే సరైన మార్గం— వాటిని చూసి, వాటిని దాటిపోయి, మనల్ని నవ్వించుకున్నట్టుగా నవ్వడం. అందుకే ఆ ఆఫీసులో రేవతి నవ్వు వినిపించిన ప్రతిసారి, అది ఒక్క మహిళ నవ్వు కాదు. అది ఓడిపోయి మళ్లీ తనను తాను సృష్టించుకున్న జీవితపు నవ్వు. ఇది ముగింపు కాని ముగింపు
Congratulations!
You've successfully completed reading all published parts of this story!
232 Views2 Comments
Disclaimer
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (2)
Meghana15 hours ago
Akka..super nice start..Meeku asalu enni kotha kottha story ideas ela vastai akka..really great.
Discussion (2)
Akka..super nice start..Meeku asalu enni kotha kottha story ideas ela vastai akka..really great.
థాంక్స్ చెల్లి మీకు