రహస్యం మొదటి భాగం — పుష్పమాలికా బంధం “ఒసేయ్ పిల్లలూ… ఇటు రండే,” అని అమ్మమ్మ పిలిచింది. ఆమె పిలుపులో ఆజ్ఞ కంటే ప్రేమ ఎక్కువ. మేమంతా ఆడుకుంటున్న చోటునుంచి ఒక్కొక్కరుగా వచ్చి ఆమె చుట్టూ కూర్చున్నాం. “వస్త్రాల మీద అల్లికలు నేర్పుతాను. మీరు చూసీ నేర్చుకుంటూ, నేను చెప్పే కథను వినండి,” అంది అమ్మమ్మ. అమ్మమ్మకు మేము సంప్రదాయ దుస్తుల్లో ఉంటే చాలా ఇష్టం. అందులోనూ పదేళ్లు దాటిన వాళ్ళం పట్టు పరికిణీ, రవికె ధరించాల్సిందే. “వయసుకి వస్త్రం కూడా ఒక సంస్కారం చెబుతుంది” అనేది ఆమె మాట. అందుకని అక్కలిద్దరితో పాటు నేనూ పట్టు పరికిణీ, రవికె ధరించాను. మేము ముగ్గురం ఇంకా ఓణీలు ధరించలేదు. మాతో పాటు చుట్టుపక్కల పిల్లలూ కొందరు వచ్చి అమ్మమ్మ చుట్టూ గుండ్రంగా కూర్చున్నారు. ఎవరి ముందో వాళ్లకు చిన్న చిన్న వస్త్రపు ముక్కలు, రంగు దారాలు, సూదులు. అమ్మమ్మ తెల్లని వస్త్రాన్ని మోకాళ్లపై పరిచింది. దాని మీద ఎర్రని దారంతో ఒక చిన్న పువ్వు అల్లడం మొదలుపెట్టింది. “అల్లిక అంటే ఏమిటో తెలుసా?” అని అడిగింది. మేమంతా ఒకరినొకరు చూసుకున్నాం. “దారం వస్త్రంలోకి వెళ్లి తిరిగి బయటికి వస్తుంది. ఒకసారి కనిపిస్తుంది. ఒకసారి కనిపించదు. కానీ చివరికి చూస్తే పువ్వు అవుతుంది. కథ కూడా అలాంటిదే. కొన్ని సత్యాలు మొదట కనిపించవు. దాగి ఉంటాయి. కాలం వచ్చాకే పువ్వులా బయటపడతాయి.” అమ్మమ్మ కళ్ళల్లో మెరుపు వచ్చింది. “ఇవాళ మీకు చెప్పేది అలాంటి కథ. పేరు—రహస్యం.” ఆమె సూదిని మళ్లీ వస్త్రంలో దూర్చింది. ***************************************** “అది విక్రమసేనుడు పరిపాలించే పంచనద రాజ్యం…” ________________________________________ పంచనద రాజసభ ఆ రోజు అసాధారణంగా ప్రకాశిస్తోంది. సింహాసనం వెనుక బంగారు తోరణాలు వెలుగుతున్నాయి. రత్నఖచిత స్తంభాలపై దీపాల కాంతి జారిపడి నేలమీద మృదువైన చీకటి-వెలుగుల అల్లిక వేసింది. ముత్యాల తెరల వెనుక అంతఃపుర స్త్రీల మృదు చలనం కనిపిస్తోంది. సభ మధ్యలో ఖాళీ ప్రదేశం ఉద్దేశపూర్వకంగా విడిచిపెట్టినట్టుంది—ఏదో తీర్పు అక్కడే జన్మించబోతున్నట్టు. సింహాసనం మీద పంచనదాధిపతి విక్రమసేనుడు కూర్చున్నాడు. అతని ముఖంలో రాజశోభ ఉంది; కాని కళ్ళలో అప్రమత్తత. ఒక రాజు వినే ప్రతి మాటలో అర్థం మాత్రమే కాదు, ప్రమాదమూ వెతకాలి. విక్రమసేనుడు అలాంటి వాడు. ఆయన కుడివైపు మంత్రి. ఎడమవైపు సేనాధిపతి ప్రచండుడు. పేరుకి తగ్గట్టే అతని స్వభావంలో ఆవేశం ఎక్కువ. అతని భుజాలపై కవచం మెరుస్తోంది; కానీ ఆ కాంతికంటే అతని కళ్ళలోని కఠినత ఎక్కువగా కనిపిస్తోంది. సభాసదులు రెండు వైపులా కూర్చున్నారు. రాజపురోహితులు, సామంతులు, వీరాధికారులు, వృద్ధ మంత్రులు, యువరాజ్యాధికారులు—అందరి చూపులూ సభద్వారం వైపు తిరిగాయి. ద్వారపాలకుడి స్వరం గంభీరంగా వినిపించింది. “బందిని సులోచనను సభలో ప్రవేశపెడుతున్నారు!” ఆ స్వరంతో సభలోని గుసగుసలు ఒక్కసారిగా ఆగిపోయాయి. ముందుగా ఇద్దరు స్త్రీభటులు లోపలికి వచ్చారు. వారి చేతుల్లో పొడవైన కుంతాలు. నడుముకు ఖడ్గాలు. వారి అడుగుల్లో క్రమశిక్షణ ఉంది. ముఖాల్లో కఠినత్వం. వారి మధ్యలో సులోచన. ఆమె చేతులకు ఇనుప సంకెళ్ళు. మణికట్ట్ల చుట్టూ చల్లని నల్లటి ఇనుపం. ఆ ఇనుప గొలుసుల రెండు చివరలు స్త్రీభటుల చేతుల్లో. ఎవరికైనా అది బంధం. కానీ ఆమెను చూసిన క్షణం ఆ గొలుసులే విచిత్రంగా చిన్నవిగా అనిపించాయి. ఆమెను బంధించడానికి అవి సరిపోవని సభ మొదటి చూపులోనే గ్రహించినట్టుంది. సులోచన సభమధ్యలో నిలబడింది. ఒక్క క్షణం—రాజసభ శ్వాస తీసుకోవడం మరిచిపోయింది. ఆమె ఆపాదమస్తకం అపూరుప లావణ్యసింధువులా ఉంది. అతిసుకుమార పద్మాలవంటి పాదాలు నేలపై నిలిచినా, నేలే వాటిని మృదువుగా మోస్తున్నట్టు. అడుగులో నాట్యం లేదు; కానీ నడకకు తాళం ఉంది. నిలబడటంలో గర్వం లేదు; కానీ లొంగని లయ ఉంది. లలిత సుందర జఘనభాగం శిల్పి కలలో ముందుగా పుట్టి తర్వాత శరీరంలో రూపం దాల్చినట్టుంది. రంభోరు ఊరుయుగళం స్త్రీత్వపు సౌందర్యానికి మాత్రమే కాదు, సమతుల్యతకు కూడా సాక్ష్యంగా నిలిచాయి. నడుము వీరుని చేతిలోని ధనుస్సు మధ్యభాగంలా సన్నగా ఉంది; కాని ఆ సన్నదనంలో బలహీనత లేదు. వంపు తిరిగిన రేఖల్లో ఒక విధమైన శాస్త్రబద్ధత ఉంది. ఆకాశంలా కనిపించని నడుంమధ్యలో సుళ్ళు తిరుగుతున్న బ్రహ్మాండ వర్తులంలా నాభిస్థానం. ప్రక్కనించి చూస్తే ధనూరేఖలా కనబడే స్తనయుగ వంపు—అది చూపును ఆపే రేఖ కాదు; స్త్రీత్వం తనను తాను ప్రకటించే నిశ్శబ్ద శాసనం. ఆపై శంఖంలాంటి మెడ. పూర్ణచంద్రబింబంలాంటి మోము. ఆ ముఖంలో సిగ్గు ఉంది; కానీ భయం లేదు. మృదుత్వం ఉంది; కానీ లోబడిన దాస్యభావం లేదు. తుమ్మెద రెక్కల వరుసతో పోటీ పడే నల్లని పొడవైన కేశజాలం ఆమె వెనుకకు జారుతూ ఉంది. బంధింపబడింది ఆమె చేతులే గాని, ఆమె రూపం కాదు. ఆమె చూపు కాదు. ఆమె చుట్టూ కనిపించని గీతలా నిలిచిన గౌరవం కాదు. సభాసదులు ఆమెను చూసి ముగ్ధులయ్యారు. కాని అది కేవలం రూపదృష్టి కాదు. వారి ముందు స్త్రీత్వం ఒక రహస్యశాస్త్రంలా, నాట్యం ఒక మౌనవేదంలా, సౌందర్యం ఒక మంత్రబద్ధ శక్తిలా నిలిచింది. విక్రమసేనుడు కూడా క్షణం నిశ్చేష్టుడయ్యాడు. ఆపై తనను తాను సవరించుకున్నాడు. ఆయన మంత్రివైపు చూశాడు. మంత్రి ఆ చూపును గ్రహించి సేనాధిపతి ప్రచండుడిని ప్రశ్నించాడు. “ఈమెపై అభియోగం ఏమిటి?” ప్రచండుడు ముందుకు వచ్చాడు. అతని గళంలో విజయం దాచిన కఠినత్వం ఉంది. “మహారాజా, ఈమె శత్రుదేశపు యువతి. పేరు సులోచన. కొన్ని మాసాలుగా అంతఃపురంలో రాజకుమారి కుముద్వతీ దేవికి నాట్యవిద్య నేర్పుతోంది.” మంత్రి కనుబొమ్మలు దగ్గరపడ్డాయి. “మరి?” “నిన్నటి రోజున ఈమె చెంతకు ఒక పావురం వచ్చింది. ఆ పావురాయి రెక్కల మధ్య ఒక చిన్న పట్టు వస్త్రం దాచబడి ఉంది. ఆ పట్టు వస్త్రంపై—‘అంతా మనకు అనుకూలంగా ఉందా?’ అని ప్రశ్న.” సభలో గుసగుసల అలికిడి పుట్టింది. ప్రచండుడు కొనసాగించాడు. “దానికి ఈమె సమాధానం—‘అనుకూలమే.’ ఆ పావురాయి ద్వారానే ఈ పడతి మాకు దొరికింది.” విక్రమసేనుడి ముఖం కఠినమైంది. “సులోచన,” అన్నాడు, “ఇది నిజమా?” సులోచన మృదువుగా తల వంచింది. “మహారాజా, అభివాదములు. పావురం నిజమే. పట్టు వస్త్రం నిజమే. ఆ ప్రశ్న నిజమే. నా సమాధానం కూడా నిజమే.” ఈసారి సభలోని గుసగుసలు స్పష్టమైన అనుమానంగా మారాయి. ప్రచండుడి పెదవుల దగ్గర చిరునవ్వు మెరిపించింది. కాని సులోచన మాట ఆగలేదు. “అయితే,” అంది ఆమె, “నిజం అన్నది ఒక్క ముక్కలో ఉండదు మహారాజా. పట్టు వస్త్రం మీద రాసిన అక్షరాల్లా అది కూడా దాచి పెట్టబడిన రహస్యం. విప్పితేనే పూర్తి అర్థం తెలుస్తుంది.” మంత్రి ముందుకు వంగాడు. “విప్పి చెప్పు.” (ఇంకా ఉంది)
CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.
Discussion (3)
Kumar2 months ago
No cross dressing boring
gvgarimaAuthor2 months ago
Already it has begun. The secret is ahead please.
gvgarimaAuthor2 months ago
This story is full of cross dressing... The secrets shall be revealed at the end. By the end of the story there are many cross dressings Kumar ji. Please wait till the end.
Discussion (3)
No cross dressing boring
Already it has begun. The secret is ahead please.
This story is full of cross dressing... The secrets shall be revealed at the end. By the end of the story there are many cross dressings Kumar ji. Please wait till the end.