Festival · Telugu

కూచిపూడి కురంగి .. .. (నాట్య మయూరి)

Completed | Part 2 of 7 | 0 Likes

Part 2

కురంగి ఆడ శిశువు కాదు. మగ శిశువే. అయితే నంద యోగి కురంగిని ఆమె గా పెంచాలి. కూచిపూడి నాట్య మయూరి గా తీర్చి దిద్దాలి అనుకున్నాడు. అయితే సిద్ధేంద్ర యోగి అతనితో స్వప్నభాషణం చేశాడు. నువ్వు కురంగిని మగవాని గానే ఉండనివ్వు. కూచిపూడి సంప్రదాయంలో మగవారే స్త్రీ పాత్రలను కూడా ధరించాలి అనే నియమం నీకు తెలిసినదే. కనుక స్త్రీగా మారితే ఆమె కూచిపూడి నృత్య సంప్రదాయానికి అర్హురాలు కాదు. అని చెప్పాడు.
సిద్ధేంద్ర యోగి మాటలకు సరేనని చెప్పిన నందయోగి కురంగిని మగవానిగానే ఉంచాడు. అయితే కూచిపూడి సంప్రదాయ ప్రకారం ఆ శిశువు నామ కరణ సమయం లోనే చెవులు ముక్కు కొట్టించేశాడు. అయితే కురంగికి మగవానిగా ఉంటూనే స్త్రీత్వం ప్రస్ఫుటం గాపెరిగాలాగా అనేక ఔషధాలను ఇచ్చేవాడు. చూపరులకు కురంగి అంటే బాలిక అనే భావన వచ్చేలాగా స్త్రీ దుస్తులలోనే ఉండేలా శ్రద్ధ తీసుకున్నాడు. కురంగికి ఎనిమిది ఏళ్ళ వయస్సు వచ్చేసరికి సంస్కృతం, నాట్యం,సంగీతం ఇతర లలితకళలు అన్నింటిలో నైపుణ్యం వచ్చింది. చక్కని అభినయ చాతుర్యం వచ్చింది. అల్లాగే ఆయుర్వేదంలో కూడా మంచి పరిజ్ఞానం వచ్చింది. వయస్సుకు మించిన శరీర లావణ్యం, మంచి మాటకారి తనం, ఇతరుల హృదయాలను చదివే శక్తి, మంత్ర, తంత్రాలపై పట్టు ఇవన్నీ వచ్చాయి. తాను మగ పిల్లవాడైనా గురువుగారు ఆడపిల్లలాగా పెంచడం లో ఆంతర్యం అర్థం కాలేదు. అయితే తనకు స్త్రీత్వం ఇనుమడించే ఔషధాలను ఇస్తున్నారు గురువుగారని మాత్రం అర్థం అయ్యింది. కురంగికి గురువ ఎంత చెబుతే అంత.
గురువు మార్గదర్శనం లో కూచిపూడి వద్ద ఉన్న ఉద్యాన వనం లో ఇప్పుడు కురంగి భామగా. మిగిలిన వారంతా గోపికలుగా అభినయిస్తూ తమ మధురభక్తిని ప్రకటిస్తూ ఉండేవారు. నందయోగి స్వయంగా రాధగా అభినయిస్తుండేవాడు. ఎనిమిది ఏఏళ్ల వయస్సులోనే ఆ సౌష్ఠవం వల్ల కురంగి 15 సంవత్సరాల బాలికలాగా కనబడే వాడు. అదృశ్యంగా సిద్ధేంద్ర యోగి చూస్తూండగా, నందయోగి అనుమతితో అక్కడ నిర్మించబడిన సోపాన పంక్తుల పై కూర్చుని పేద, ధనిక భేదం లేకుండా అందరూ కలిసి కూర్చుని ఆ కూచిపూడి నృత్య రూపకాలను .. పారిజాతాపహరణం, సముద్రమథనం, భామాకలాపంవంటి వాటిని అందరూ చూస్తుండేవారు. అక్కడ ఉన్న యువకులకు కురంగి అంటే స్వప్నరాజకుమారి. ఆమె సౌందర్యం అంటే వాళ్ళకి వ్యామోహం అటువంటిది. వారెవ్వరికీ తెలియని రహస్యం కురంగి అంటే ఆడ పిల్లకాదని. కురంగి అంత సుందరమైన యువతి లాగా కనబడటానికి కారణాలు చాలా ఉన్నాయి. కురంగి చేసే శరీర వ్యాయామం పలు విధాలు. దండెములు, గుంజీలు, తీసేవాడు. కాలిసాము చేసే వాడు. కుప్పీలు (అంటే కుప్పిలి గంతులు) వేసే వాడు. మొగ్గలు, వాలు మొగ్గలు వేసే వాడు. మాండూకప్లుతం అంటే కప్ప గంతులు వేసేవాడు. పిల్లిలా, కోడిలా, పాములా నడిచేవాడు. లేడిపిల్లలా గంతులు వేసే వాడు. నెమలి నడక నడిచే వాడు. వీటన్నింటివల్ల కురంగి శరీరం తాను చెప్పినట్లు వినేది. అలాగే గురువు ఇచ్చిన మందులు ఏమిటో తెలిసి కూడా తాను స్త్రీ సౌందర్యాన్ని పొందుతానని కేవలం పుట్టుక వల్ల మాత్రమే పురుషునిగా ఉంటానని తెలిసి కూడా కూచిపూడి నృత్యానికి బహుళ జనాదరణ కావాలి అనే కోరిక తో అలా ఔషధ సేవనం చేసేవాడు. తాను ధరించే దుస్తులు కూడా స్త్రీల వస్త్రాలే. వాళ్ళ గ్రామం లో ఆడపిల్లలంతా కురంగితో జత కలిసి ఒసేవ్ కురంగీ అంటుండేవారు. ఆట, పాటలన్నీ కురంగీతోనే.
కురంగి నేర్చుకున్న కూచిపూడి నృత్య విశేషాలు ఎన్నెన్నో. సాత్త్వికభావాలు, అంగహారములు, పిండీబంధములు, 108 కరణాలు, రేచకిలు, చారీ ప్రకారాలు, మండల ప్రయోగాలు ఇల్లా అన్ని ప్రయోగవిశేషాలను క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. స్త్రీ సహజమైన రస దృష్టులు కూడా తెలుసు. తాను ఎప్పడూ పురుష గతమైన ఉద్ధత చలనం, దంభ, వీర ప్రవృత్తి వంటి వాటిని నేర్చుకోలేదు. అయితే స్త్రీల శీల భేదాల గురించి ఎంతో క్షుణ్ణంగా గుర్తించగల నేర్పు సాధించాడు. స్త్రీలను చూడగానే వారు ఏవిధమైన స్త్రీలో చెప్పేవాడు. కూచిపూడి నాట్య లక్షణాలను బట్టి స్త్రీలు దేవ, దానవ, గంధర్వ, రాక్షస, నాగ, పక్షి, పిశాచ, యక్ష, వ్యాల, నర, వానర, హస్తి, మృగ, మీన, ఉష్ట్ర, మకర, ఖర, సూకర, వాజీ, మహిష, అజ, శునక, ధేను శీలములు కలవారు ఉంటారు అని కూచిపూడి లక్షణ గ్రంథాలు చెబుతున్నాయి. వారిని ఆపాద మస్తకం ఒకసారి చూసి వారి ప్రవృత్తి ఎటువంటిడో చెప్పేవాడు.
తాను నేర్చుకున్న విశేషాలన్నింటినీ కురంగి నాట్య ప్రదర్శనలో చూపేవాడు. అదే అందరికీ ఆకర్షణ. అల్లా ఆకర్షిం పబడిన వారిలో ఆ పరగణా జమీందారు కూతురు మోహనాంగి కూడా ఉంది. ఆమె కురంగిని స్త్రీ అనే భావిస్తుంటుంది. అయినా ఆమెకు కురంగి అంటే ఎంతో ఇష్టం. ఆమెతో ఒక రాత్రయినా గడపాలి అని ఆమె అభిప్రాయం.
ఇది ఇలా ఉండగా ఒకసారి శ్రీశైల ప్రాంతంలో దూరపు ప్రదేశం నుంచి ఒక కాపాలికుడు బాటసారిగా వచ్చాడు. తక్కువ సమయంలోనే అతని ప్రభావం అందరికీ అర్థమయ్యింది. దుర్భిణి లో చూసి కాపాలికుడు కురంగి స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అని గ్రహించాడు. కురంగికి రక్షణ గా ఉన్నది నందయోగి అని కూడా ఆలోచించేశాడు. కురంగిని శాశ్వతంగా స్త్రీ గా మార్చాలి అంటే ముందు నందయోగిని నివారించాలి. అందుకని గురువుని తలుచుకుంటూ నందయోగి దగ్గరకు వచ్చాడు. (సశేషం)

1539 Views 0 Comments
Disclaimer

CD Stories is a multilingual open platform. Stories published are generated by writers. The platform has not reviewed, modified, or validated contents and holds no liability regarding content quality or copyright infringements.

Discussion (0)

No comments shared yet. Be the first to share your thoughts!
Want to comment? Please Login or Sign Up.
Reading preferences
100%
Home Discover 0 Alerts Writers Login