ఒక రోజు నేను హాస్పిటల్ లో బిజీ గా ఉన్న సమయంలో నా మొబైల్ ఫోన్ మ్రోగింది. ఫోన్ ఎత్తగానే అవతల్నుండి "ఆంటీ". హాస్పిటల్ అయ్యాక ఒక్కసారి వాళ్ళ బంధువుల ఇంటికి రమ్మనమని. ఈ నా జీవితమే ఆంటీ పెట్టిన భిక్ష. కాదనడానికి నేనెవర్ని! వెళ్లాను ..... వైష్ణవి, వాళ్ళ ఆయన ప్రకాష్ (వైష్ణవి మ్యారేజ్ అయ్యిపోయి అప్పటికి 2 సంవత్సరాలు), ఆంటీ ఉన్నారు. ఆంటీ ముఖంలో ఏదో అలజడి కనిపిస్తోంది. ఆమె చేతిలో ఎవరో చిన్న పిల్లవాడు మహా ఉంటే 2 సంవత్సరాల వయస్సు. నేను చేసేది పిల్లల హాస్పిటల్లో కదా! నాకు తెలిసిన టెక్నిక్స్ తో పిల్లాడిని ఆకర్షించేసాను. వాడు నాకు బాగా క్లోజ్ అయ్యాడు ఒక్క అర గంటలోనే. ఆ తరువాత తెలిసింది ఆ బాబు అశోక్ కొడుకని! ఫిన్లాండ్ లో తన కొలీగ్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, బాబు పుట్టిన తరువాత ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చి విడిపోయారని.... అశోక్ కి ఆ పిల్లాడిని ఇచ్చేసి తను డివోర్స్ తీసుకుని వెళ్ళిపోయిందని ఆంటీ చెప్పారు ..... ! ముందు రోజు రాత్రి వచ్చాడట అశోక్ పిల్లాడితో! నాకు ఏడుపొచ్చేసింది అశోక్ పెళ్లి చేసుకున్నాడని అదీ ఎవరికీ తెలియకుండా! నా ముఖంలోని భావాలు చదివేసింది ఆంటీ! లావణ్యా! రేపు మార్నింగ్ అమ్మ దగ్గరికి నేను వస్తాను .... నీకు టైం అవుతోంది ఇంటికి వెళ్ళు అమ్మా నాన్న కంగారు పడతారు అంది. నేను సరేనని ఇంటికి బయలుదేరాను..... అశోక్ కనపడలేదు. తనని చూడాలని నా మనస్సు లో ఉవ్విళ్ళు ఊరుతోంది. తను కనపడలేదు. ఇంటికి చేరుకున్నాను. నా మనస్సులో ఏదో బాధ. అమ్మతో అంతా చెప్పాను. అమ్మ చాలా బాధపడింది. ఆంటీ కి ఫోన్ చేసి "వదినా! నాకెంతో చేశావు. కనీసం నీ బాధలు నేను పంచుకోలేననుకున్నావా? అంటూ ఉన్నపళంగా ఇంటికి రమ్మంది. నాన్నకి చెప్పగానే నాన్న కార్ వేసుకొని వెళ్లి ఆంటీ, వైష్ణవి, ప్రకాష్, బాబు ని తీసుకుని ఇంటికి వచ్చారు. అశోక్ జాడ లేదు. వైష్ణవి ని సీక్రెట్ గా ఆడిగాను. తను ఇంట్లోనే ఉన్నాడు .... కానీ చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు .... ఆల్కహాలిక్ కి బాగా అలవాటు అయిపోయాడు ... ఎవరితోనూ మాట్లాడటంలేదు అని చెప్పింది ఏడుపు గొంతుతో. అశోక్ కొడుకు నన్ను చూసి ఒక్క గెంతులో నాదగ్గరికి వచ్చేశాడు. నాకు బాగా మాలిమి అయిపోయాడు. అన్నం తినిపించి నిద్రపుచ్చాను నా రూమ్ లో! ఆంటీ నన్ను సాలోచనగా చూస్తోంది! తన ముఖంలో ఏదో అశాంతి. నాకున్న ఎన్నో సమస్యలను తీర్చిన ఆంటీ అట్లా ఉండే సరికి నాకు ఎంతో బాధ అనిపించింది. వాళ్ళు భోజనం చేసిన తరువాత వైష్ణవి,ప్రకాష్ లు గెస్ట్ రూమ్లో పడుకోవటానికి వెళ్ళిపోయారు! అమ్మ "జానకీ! లావణ్య రూములో పిల్లాడు ఉన్నాడు కదా మన ముగ్గురమూ లావణ్య రూములో నిద్రపోవచ్చు. అలసి పోయావు పద" అంటూ నా రూం లోకి తీసుకు వచ్చింది.
ఆ రాత్రి అమ్మతో ఆంటీ అన్ని విషయాలూ చెప్పింది. తమకు ఇష్టంలేని పెళ్లి అశోక్ ఎలా చేసుకున్నాడో, అశోక్ పెళ్లి చేసుకున్న అమ్మాయి డామినేటింగ్ కేరక్టర్, దానితో అశోక్ యెట్లా డ్రంకర్డ్ అయ్యిపోయాడో అన్నీ వివరంగా చెప్పింది. ఇప్పుడు ఆ తల్లి లేని పిల్లాడిని యెట్లా పెంచాలో ఏమీ అర్ధం కావట్లేదు వదినా! అన్నీ ఉన్నాయి అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది. చూద్దాం కాలమే మా గాయాన్ని మాన్పుతుంది అంది. ఆంటీ అమ్మ ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నా నా మనసు అశోక్, ఆ పిల్లాడి చుట్టూనే తిరుగుతోంది. అశోక్ ని చూడాలని నా మనసు తహతహలాడుతోంది. నాకెందుకో అశోక్ మీద కోపం రావడంలేదు. ఎందుకంటే తను నన్ను పెళ్లి చేసుకున్నా నేనెలాగూ సహజ స్త్రీని కాదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశం లేదు అందుకని ఆ దేవుడు ఇట్లా నా కోరికను తీర్చుతున్నాడేమో అనే అనిపించింది ఆ రాత్రి సమయంలో. బాబును పోదివిపట్టుకుని నా ప్రక్కలో వేసుకున్నాను. వాడు అలికిడి కి ఒక్కసారి మేలుకుని నన్ను చూసి నా మెడచుట్టూ చేతులు వేసుకుని మళ్ళీ నిద్రపోయాడు. నాకు వాడి మీద వాత్సల్యం పుట్టుకొచ్చిన క్షణం అది. వాడి చేతులు కొద్దిగా తప్పించుకుని వాడి ప్రక్కలో తలగడ దిండు పెట్టి బయట బాల్కనీ లోకి వచ్చి అశోక్ కి ఫోన్ చేశాను. రెండు సార్లు రింగ్ అయ్యింది కానీ తియ్యలేదు. కాసేపటికి మూడో ప్రయత్నంలో ఫోన్ తీసాడు అశోక్. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. న హృదయ స్పందన నాకే తెలుస్తోంది. హూ ఈజ్ దట్? అంటూ అవతల్నుండి అశోక్ వాయిస్. కొంచెం మౌనమ్ తరువాత "అశోక్! నేను నానీ అదే లావణ్యని గుర్తుకొచ్చానా? ఎట్లా ఉన్నావ్? ఈవెనింగ్ ఇంటికొచ్చాను నిన్ను కలవలేకపోయాను" అన్నాను. అశోక్ "లావ్స్! హౌ ఆర్ యు? యేవో పర్సనల్ విషయాల్లో పడిపోయి ఈ మధ్య నీతో మాట్లాడలేక పోయాను. యెట్లా ఉన్నావు? అమ్మా నాన్న అందరూ బాగున్నారా? దీపక్ గాడు ఎక్కడ?" అంటూ హుషారుగా మాట్లాడాడు. నేను అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. రేపు ఉదయం 11 గంటలకి పార్క్ లో కలుద్దామా? అన్నాను. ష్యూర్! వై నాట్? కలుద్దాం అంటూ ఫోన్ పెట్టేశాడు. మళ్ళీ రూంలోకి వెళ్లేసరికి ఆంటీ నిద్రపోయారు. బాబు ప్రక్కనే నేనుకూడా నిద్రకు ఉపక్రమించాను.
ఆ ఉదయం నిద్ర లేవగానే బాబుకి నేనే స్నానం చేయించాను. బ్రేక్ ఫాస్ట్ కొంచెం తినిపించి పాలు పట్టాను. వాడు నేను వాడికి ఎప్పటినుండో తెలుసును అన్నట్లు నా చుట్టూనే తిరుగుతున్నాడు. నాన్న బ్యాంకు వెళ్ళిపోయారు. నేను నాకిష్టమైన అశోక్ ఎప్పుడో నాకు గిఫ్ట్ ఇచ్చిన చందేరీ సిల్క్ చీర కట్టుకుని సింపుల్ గా తయారు అయ్యేసరికి ఆంటీ "మేము వెళ్తాము లావణ్యా! అశోక్ కి వంట వండాలికదా! వాడు యెట్లా ఉన్నాడో ! బాబు వాడికే మాలిమి" అంటూ బయలుదేరారు. నేను ఆంటీ తో "మీరు వెళ్ళండి ఆంటీ నేను బాబుని హాస్పిటల్ కి తీసుకు వెళ్లి అక్కడనుండి ఇంటికి తీసుకు వస్తాను. ఈ రోజు డాక్టర్స్ ఏదో సెమినార్ కి వెళ్తున్నారు. హాస్పిటల్ లో పని ఉండదు కాబట్టి వీడితో సరదాగా కాసేపు కాలక్షేపం చెయ్యొచ్చు" అన్నాను. వాడుకూడా నాతోనే ఉండేసరికి ఆంటీ సరే నీ ఇష్టం అంటూ వైష్ణవి, ప్రకాష్ లతో కలిసి వాళ్ళింటికి వెళ్ళిపోయారు. అమ్మ నాకు బాక్స్ పెట్టబోయింది. అమ్మ తో హాస్పిటల్ లో ఒక చిన్న లంచ్ పార్టీ ఉంది అంటూ చెప్పి బాబు ను తీసుకొని కార్ వదిలేసి ఆటో లో బయలుదేరాను. అమ్మ చిత్రంగా చూసింది. ఆటో బయలుదేరగానే "హాస్పిటల్ కి ఫోన్ చేసి లీవ్ చెప్పాను". కార్బన్ పార్క్ వైపు ఆటో పోనీయమన్నాను. అప్పటికి సమయం 10.45 నిముషాలు అయ్యింది. బాబు కి ఆటో కొత్తగా అనిపించి నా మెడచుట్టూ చేతులు వేసుకుని బయట ప్రదేశాల్ని సంభ్రమంగా చూస్తూ ఉత్సాహంగా కేరింతలు కొడుతున్నాడు. వెళ్ళే సరికి అశోక్ అక్కడనే ఉన్నాడు. నాతో బాబుని చూసేసరికి అశోక్ ముఖంలో ఆశ్చర్యం! ఆఖరికి అశోక్ దగ్గరకు కూడా వెళ్ళటంలేదు వాడు.
అక్కడికి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లోకి వెళ్లి ఒక మూల కూర్చున్నాం. కాసేపటికి యెట్లా ఉన్నావ్ అశోక్? అంటూ నేనే సంభాషణని మొదలు పెట్టేసరికి అశోక్ లావ్స్! నౌ యు ఆర్ ఏ కంప్లీట్ వుమన్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఐ యాం మీటింగ్ యు! యు ఆర్ లుకింగ్ ప్రెట్టీ. అంటూ ఏవేవో విషయాలు మాట్లాడుతున్నాడు కానీ ఏదీ సూటిగా లేదు. ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు. నేను కాసేపటికి అశోక్ నేను బెంగుళూరు వచ్చి ఇప్పటికి 7సంవత్సరాలు అయ్యింది. నేను కట్టుకున్న చీరను గమనించావా. ఏడు సంవత్సరాలక్రిందట నువ్వు కొనిపెట్టిన చీర ఇది. నీతో గడిపిన ఆ నాలుగు నెలలూ నా జీవితంలో మరిచిపోలేను. జీవితంలో నన్ను ఒక ఆడదానిగా గుర్తించిన తొలి మగాడివి నువ్వే. నువ్వు పెళ్లి చేసుకున్నావు అని నాకేమీ అసూయ గా లేదు. అలా అని నిన్ను ప్రశ్నించే సాహసం చెయ్యలేను. నా జీవితంలో ఎవరూ లేరు ఎందుకంటే నేను సహజమైన స్త్రీని కాదు లోకం దృష్టిలో. నేను కూడా ఎవరినీ దగ్గరకు రానీయలేదు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. ప్రేమ. సరే ఇంకా విషయానికి వస్తాను. నీ వ్యక్తిగతం నాకు అనవసరం. కానీ నేను అభిమానించే వ్యక్తిగా నాకు సమాధానం చెప్పు. నువ్వు ఇష్టపడి చేసుకున్న వివాహం విడాకుల వరకూ వచ్చేసరికే మందుకి బానిస అయ్యిపోవాలా? మన కల్చర్ కాదు కాబట్టి నీ భార్య అంత ఈజీ గా పిల్లాడిని నీకిచ్చేసి చక్కగా వెళ్ళిపోయిందని ఇంకా ఎంతో మిగిలి ఉన్న నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? పిల్లాడి భవిష్యత్తు ఏమిటి? అని డైరెక్ట్ గా ప్రశ్నించేసరికి ఆశ్చర్యపోయాడు అశోక్. నిన్ను అభిమానించే వాళ్ళను దూరంచేసుకోకు అని నువ్వేమీ నాకు సమాధానం చెప్పనక్కరలేదు. నిన్ను నువ్వే ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం నువ్వు గడుపుతున్న విధానం చూసి ఒక కన్నతల్లిగా ఆంటీ పడుతున్న క్షోభ చూసి నేను ఇంత ధైర్యం చేశాను అశోక్. అన్నాను. తప్పైతే క్షమించు అన్నాను.
ఒక పది నిమిషాలు వాతావరణంలో నిశ్శబ్దం ఆవరించింది. ఎదురుగా కూర్చున్న అశోక్ నెమ్మదిగా లేచి వచ్చి నా ప్రక్కనే కూర్చుని "లావ్స్! ఇంతవరకూ నా జీవితంలో నన్ను ఇట్లా ప్రశ్నించిన వ్యక్తి ఎవరూ లేరు. ఆఖరికి అమ్మ కూడా ఏదో నర్మగర్భంగా చెప్పేది తప్ప నీకులా ఎవరూ నన్ను ప్రశ్నించలేదు. ఇంత ప్రేమగా నన్ను మందలించలేదు. కానీ నీ ప్రశ్నలు నన్ను తప్పక మారుస్తాయి. చూడు నాలో తప్పక మార్పుని చూస్తావు. నా గమ్యం ఏదో ఇప్పటికీ నాకు తెలీదు .... కానీ నేను ఇండియా లోనే ఉండబోతున్నాను. నా వాళ్ళను వదులుకోకూడదని నీ మాటలు విన్నాక నిర్ణయించుకున్నాను. థాంక్ యూ వెరీ మచ్ అంటూ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి బాబుని దగ్గరికి తీసుకున్నాడు. బాబు మేమిద్దరమూ దగ్గర అయ్యేసరికి ఆనందంతో నవ్వులు రువ్వటం మొదలుపెట్టాడు. నా మనసు తేలిక పడింది. లంచ్ పూర్తయ్యాక ఇద్దరమూ అశోక్ కారులో వాళ్ళింటికి వెళ్ళాము. మా ముగ్గురినీ చూసి ఆంటీ ఆశ్చర్య పోయింది. నేను కళ్ళతో సైగ చేసి "ఆంటీ దారిలో అశోక్ కనిపించాడు. ఎలాగూ ఇంటికే కదా అని కారెక్కేశాను అంతే" అన్నాను. ఈవెనింగ్ వరకూ అక్కడే ఉండి ఇంటికి బయలుదేరేసరికి బాబు నా వెంటపడ్డాడు. ఆంటీ వాడిని నిద్రపుచ్చాక వెళ్దువు అని వాడిని నిద్ర పుచ్చాక నన్ను ఇంట్లో డ్రాప్ చెయ్యటానికి అశోక్ ను తోడుగా పంపింది. దారిలో ఏమీ మాట్లాడలేదు అశొక్. నన్ను మా వీధి చివరిలో దింపుతూ "అయ్ లవ్ యూ లావ్స్! గుడ్ నైట్" అంటూ వెళ్ళిపోయాడు.
Discussion (0)